Search This Blog

Wednesday, 28 November 2018

వ్యవసాయం భారతీయ జీవన విధానం.

భారతదేశం అనాదిగా వ్యవసాయాధారిత దేశం. పల్లెల్లో ప్రజలు భూమిని నమ్ముకొని గొడ్డు గోదా పిల్లామేకలతో ఉన్నదాంట్లోనే సర్దుకొంటూ సంసారం సాగించేవారు. 90 వ దశకం వరకు పారిశ్రామిక రంగానికి,వ్యవసాయ రంగానికి ఉత్పార్దకత లో పెద్దగా అంతరం లేకపోవడం చేత ఈ రెండురంగాలలోని ప్రజల జీవితాలలో  చెప్పుకోదగ్గ అసంతృప్తులు లేవు. 

ఎప్పుడైతే పారిశ్రామిక సంస్కరణలు మొదలయ్యాయో , వ్యాపార రంగానికి బాంకులు విచ్చలవిడిగా లోన్స్ ఇవ్వడం మొదలు పెట్టాయో ,అప్పటి నుండి పారిశ్రామిక ,ఆ తర్వాత సేవారంగాలలో ఉత్పా దకత  బాగా పెరిగిపోయి, వ్యవసాయ రంగం లోని ఉత్పాదకత తగ్గిపోవడం జరిగింది. 
విద్యారంగం కూడా కేవలం సేవారంగానికి పనికొచ్చే పౌరులను తయారు చేసే కర్మాగారాలుగా మారిపోయాయి. 

నేటికీ, దేశంలో 80కోట్లమందిని వ్యవసాయరంగమే పోషిస్తుంది.  దేశంలోఉన్న అనేక రకాల  ఉద్యోగాలలో 50శాతం వ్యవసాయ కూలీ అనే  ఉద్యోగమే!
మనకుతెలుసు, వ్యవసాయం అనేది పరిశ్రమ కాదు. వ్యవసాయం అనేది సేవారంగమూ కాదు. వ్యవసాయం ట్రేడింగ్ వ్యాపారం కానే కాదు. అందుకే  మనం చెప్పుకొంటున్న భౌతికపరమైన సంపద లెక్కల్లో వ్యవసాయం లాభసాటి కాదు. ఆర్థికవేత్తలు లెక్కలిలా ఉంటాయి. 50శాతం ఉద్యోగులు దేశ  జా తీయ ఉత్పత్తి కి  కేవలం 16శాతం మాత్రమే ఇస్తున్నారని వారంటారు. వారికి తెలియదా?వ్యవసాయం వ్యాపారం కాదు,లాభాపేక్షలు చూసి చేసేది కాదు. వ్యవసాయం భారతీయ జీవన విధానం. 

దేశంలోని 30కోట్ల ఎకరాల లో వ్యవసాయం,వ్యవసాయ అనుబంధ రంగాలైన డైరీ,ఆక్వా, పౌల్ట్రీ , ఉద్యానవన,అరణ్య ,మెడిసినల్ హెర్బల్స్ ద్వారా ఏ టా సుమారు 20 లక్షలకోట్ల రూపాయల విలువైన ఉత్పత్తు లు- అనగా 30 కోట్ల టన్నుల ధాన్యాలు , 15కోట్ల టన్నుల పాలు, 30కోట్ల టన్నుల పండ్లు, కాయగూరలు ,7మిలియన్ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతున్నాయి. 

ఏది ఏమైనా వ్యవసాయ రంగంలో ఉన్న 10కోట్ల రైతులు (భూమి యజమానులు) గానీ, దీనిపై ఆధారపడిఉన్న 15కోట్ల కూలీలు గానీ సంతోషంగా లేరు. ఎందుకంటే బతుకు పరుగులో  ,ఎవరైతే పరిశ్రమలు,సేవారంగాన్ని వెదుక్కుంటూ పట్టణాల బాట ప ట్టారో వారి బతుకులు మరింత రంగులమయంగా కనబడుతుంది. 
భూమి వారికీ అన్నంపెట్టే తల్లి లా కనబడం మానేసి అప్పుల భారంతో కుంగదీసే వ్యధ భూమిగా కనబడటం మొదలైంది.  ఈ సంకెళ్లనుండి తెంచుకొని పోవాలంటే ఉన్న ఒకే ఆయుధం చదువు. 

తరాలు పెరుగుతున్న కొద్దీ వ్యవసాయానికి గుండెకాయ గా ఉండే   ఉమ్మడి కుటుంబాలు విఛ్చిన్నమై న్యూక్లియర్ కుటుంబాలు పెరుగుతున్నకొద్దీ కమతాల సైజు తరతరానికి తగ్గిపోతుంది. జనాభాతో పాటు  భూమి పెరగదు గదా?
కమతాల సైజు సరాసరి ఒక్కో వ్యవసాయదారుడికి కేవలం 1ఎకరా గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడిలేని ప్రక్రుతి వ్యవసాయం ,  రసాయన ఎరువులు,పురుగుమందులను తగ్గించి గోవు ఆధారిత సేంద్రియ ఎరువులు , మూలికలనుండి తీసిన పురుగుమందులను వాడించి , సూక్ష్మ బిందు తుంపర సాగుతో దిగుబళ్లను సాధించే పద్ధతులను ప్రవేశ బెట్టారు చంద్రబాబు. ఇది ఎంతో ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం. 

  • మార్కెట్టులో ఏ పంటలకు నిలకడైన మద్దతు ధర ఉంటుందో, ఏపంటలకు డిమాండ్ ఉంటుందో, ఏ పంటలను ఎక్కువకాలం పాడవకుండా నిల్వ  చెయవచ్చొ అలాంటి పంటలను మాత్రమే సాగుచే యించాలి.  
  • పంట దిగుబడిని కోల్డ్ స్టోరేజీ లలో నిల్వ చేసుకొనే సదుపాయాలు , సోలార్ ఆధారిత డ్రయ్యర్ లు ప్రతి పంచాయితీలో ఉండాలి. 
  • మెకానికల్ వ్యవసాయ  వ్యవస్థను అనగా ట్రాక్టర్లు , కోత నూర్పిడి యంత్రాలు, కలుపుతీత యంత్రాలు, నాట్లు వేసే యంత్రాలు సమస్తం ప్రతి పంచాయితీలో  అందుబాటులో ఉండాలి.  
  • ఇవన్నీ కూడా  డబ్బు చెల్లింపులు లేకుండా పండినపంట ను  బార్థర్ ఇచ్చే విధంగా ఉండాలి. అపుడు అప్పులు చేయవలసిన అవసరం ఉండదు. 
  • పంట భీమా నిర్బంధంగా అమలుచేయాలి. 
  • ఏదైనా ఒక జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రభుత్వమే సొంతంగా వ్యవసాయం చేసి పండిన పంటను ఎకరాకి ఇంతని కవులుగా రైతులకి ఇస్తే  మరింత బాగుంటుంది. 
  • వ్యవసాయంలో యాంత్రికత ఎంతపెరిగితే అంతగా కూలీలు వేరే రంగానికి మారతారు . కాబట్టి ప్రతి పంచాయితీలో నైపుణ్యాభివృద్ధి తరగతులు నిర్వహించాలి. 
  • కమ్మరి , కుమ్మరి,చాకలి, యానాది ,చేనేత,కల్లుగీత ,టైలర్,కంసాలి లాంటి  చేతిపని వారికి  నైపుణ్యాభివృద్ధి తరగతుల తోపాటు ఆధునిక పనిముట్లు అందించాలి. 
  • తక్కువ మనుషులు,ఎక్కువ ఉత్పద కత ఉంటేనే వ్యవసాయం లాభసాటి గా ఉంటుంది.  
  • భూమిని,పంటను ,తేమశాతాన్ని పరీక్షించే సాంకేతికత ప్రతి పంచాయితీలో ఉండాలి. 
  • ప్రభుత్వం  తన పధకాలను ప్రజలకు ఎంత అవినీతి రహితంగా ,, లబ్దిదారులకు ఎలాంటి కష్టం లేకుండా  ఎంత త్వరగా అందించగలదో ,అంతగా ప్రజామోదాన్ని పొందుతుంది. కేవలం పధకాలు ప్రకటించేసి అవినీతి, బంధుప్రీతి, పార్టీ ప్రీతి తో అసలైన లబ్దిదారులకు అందించకుంటే  మరింత తిరస్కారాన్ని ఎదుర్కొంటుంది. 
  • పంచాయితీ ల చేతిలోనే ప్రాధమిక అధికారాలు అనగా పంచాయితీ స్థాయిలో పనిచేసే వారికి ఆయా పంచాయతీలే జీతాలు,ఇతరత్రా సంక్షేమం చూడాలి. అలాగే పంచాయితీ వనరుల ఆదాయం లో 70శాతం ఆయా పంచాయతీలకే దక్కాలి. అపుడే గ్రామ సురాజ్యం బలపడుతుంది.