ఉపనిషత్తులు..... వాటి సారాంశం..... క్లుప్తంగా
సనాతన భారతీయ దార్శనికులు వారికి పూర్వం చెల్లా చెదురుగా ఉన్న అనేక శాస్త్రీయ సత్యాలను పూసగుచ్చినట్లుగా భద్రపరిచేవారు. ద్వాపర యుగం చివరి రోజుల్లో శంతన మహారాజు మరియు భీష్ముని ప్రాపకం లో వేదవ్యాస మహర్షి అనేక మంది శాస్త్రజ్ఞులు,సంప్రదాయ వేత్తలు,సామాజిక ధర్మ నిర్ణయా ధికారులు, ఆధ్యాత్మిక ఋషి పుంగవులు , ఆగమ దార్శనికులు, నిగమ పండితులు ఇలా ఆ కాలంనాటి మేధావులందరినీ సమావేశపరచి వేద వాజ్ఞ్మయాన్ని - సంహితలు , బ్రాహ్మణములు, అరణ్యకాలు & ఉపనిషత్ లుగా వర్గీకరించాడు .
1108 ఉపనిషత్ లు ఉన్నాయని ఒక లెక్క ఉంది . వాటిల్లో ముఖ్యమైనవి 108 అనీ, మరీ ముఖ్యమైనవి 10 ఉపనిషత్ లని ఆధ్యాత్మిక శాస్త్ర వేత్తల ఉవాచ .
ఒక ఆధ్యాత్మిక సాధకుని మహాప్రస్థానం లో ఎలాంటి దశలుంటాయి ? ఆయా దశలలో ఎలాంటి భావనలు ఉంటాయి ?అనే విషయాలు , ఉపనిషత్ లలో ద్వైత ,విశిష్టా ద్వైత ,అద్వైత భావనలు గా కనబడతాయి. అంతేకాదు మనుషులు, భిన్న మానసిక ఉద్వేగ , కర్మ , జ్ఞాన , ఐచ్చిక స్థాయిలలో ఉంటారని , వారు జన్మ లక్ష్యమైన జన్మరాహిత్యాన్ని సాధించాలంటే ఏమి చేయాలో కూడా వేదం లో చెప్పారు .
మానవుల లక్ష్యాలేమిటో చూద్దాం:
దుఃఖ రాహిత్యం, బంధ రాహిత్యం , జన్మ రాహిత్యం !
దేహానికి ఆకలి,దప్పికలు
సూక్ష్మ దేహానికి క్షుత్ పిపాసలు
కారణ దేహానికి మోహ లోభాలు సహజం
బాధ, దుఃఖం, అసంతృప్తి, నిరాశతో వచ్చే ఆలోచనలను సమర్ధవంతంగా ఎదర్కోవటం ఎలా? • కొందరు కష్టాల్లో కూడా ఆనందంగా ఉం టున్నారు , కొందరు అలా ఎందుకు ఉండలేరు ? • ఎల్లప్పుడూ ఆనందంగా/సంతృప్తితో ఉండాలంటే ఎలా? • భయాన్ని త్యజించ లేమా ? ఎప్పుడూ దైర్యంగా ఉండాలంటే ఎలా? • విపరీతంగా కలిగే కోర్కెలు ఎలా నియంత్రిమ్చు కోవాలి ? మన సత్తా ఏమిటో తెలుసుకొని అప్పుడే కోర్కెలు రూపొందించుకొంటే జయానికి ఎక్కువ అవకాశం ఉంటుంది . కోర్కెలు , బంధాలు శాశ్వతం గా ఎలా తీసివేయాలి?
నేను-నాది (అహం- మమ ) ?
జీవ -జగత్ -ఈశ్వర ?
స్థలం -కాలం ?
స్థూల తత్త్వం - భూత పంచీకరణ
సూక్ష్మ తత్త్వం - సూక్ష్మ భూత ములు ?
త్రిగుణ ప్రక్రుతి ,/మాయాశక్తి/ పరాశక్తి
నేను అనేది పదార్ధమూ కాదు, శక్తీ కాదు. అది కేవలం స్ఫురణ . అనంతంగా అఖండంగా వ్యాపించి ఉన్నాననే ఎరుక . అది ఖండ ఎరుక అవుతే అదే జీవుడు . నన్ను నేను తెలుసుకోవడం ఎలా ? ఈ సృష్టి ఎందుకు జరుగుతుంది ? జీవ జగత్ ల పుట్టుకకు ఏదైనా అర్ధం ఉందా? కాల చక్రం ,సృష్టి చక్రం , జీవ చక్రం, కర్మచక్రం ఎలా ఎన్నెన్నో చక్రాల యెక్క అర్ధం ఏమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలే ఉపనిషత్ లు .
1) ఈశావాస్యోపనిషత్:-- ,తాను సర్వమూ వ్యాపించియున్నానని, సర్వ వ్యాపకత్వం అనేస్థితి (సత్) కి తెలుసా ? ఆ .... తెలుసు ! ఆ తెలివిడే జ్ఞానం / సంప్రజ్ఞత / మహాచిత్ . కానీ ఈ మహా సత్ చిత్ లోని కొన్ని చిన్ని చిన్ని భాగాలకు ఈ సంప్రజ్ఞత / తెలివిడి ఉండదు. ఎందుకని ? ఎందుకంటే, తాత్కాలికంగా తెలివిడి ని మాయ కమ్మేసింది . తాత్కాలికం అంటే ఎన్ని ఏళ్ళు ? ఎన్నో మన్వంతరాలు , ఎన్నెనో కాస్మిక్ సంవత్సరాలు.
మాయ అంటే ఏమిటి ? మతిమరపు నే మాయ అనవచ్చా ? ఈ మహా మతిమరుపు కు మరోపేరు అవిద్య! విద్ అంటే తెలివిడి లేదా తెలుసుకొనే సామర్ధ్యం. అవిద్ అంటే ఆ సామర్ధ్యం లేకపోవడం!
ఎప్పుడైతే మతిమరపు ఉందో అప్పుడే మోహం అంటే లేనిది ఉన్నట్లుగా ,ఉన్నది లేనట్లుగా ఉల్టా పల్టా గా తోస్తుంది . దీనివలన ఆనందం చెదిరిపోతుంది. దీనినే శోకం అంటాం.
సర్వం ఆత్మగా దర్శించినప్పుడు ,సర్వాన్ని ఏకత్వ భావనతో చూసినప్పుడు,శోకం మటుమాయమవుతుందని ఈ ఉపనిషత్ చెప్తుంది.
the infinitesimally expanded perspective is the goal!
------------------------------
2) కేనోపనిషత్:-- కది లే కారు ,అది నడిచే రోడ్ అన్నీ కూడా ఒకేరకమైన అణువులనుండే తయారయ్యాయి. రోడ్ కదలదు. కానీ కదిలే వాహనాలకు అది ఆధారం . అలాగే సముద్రం ,అలలు,నురగ, బుడగలు అని మనం చెప్పుకొనే వన్నీ నీరే! గాజులు,వంకీలు,వడ్డాణాలు,కమ్మలు అనిచెప్పుకొనే ఆభరణాలన్నీ బంగారమే. అదేవిధంగా ఆకాశం అనే జడమైన స్థితి పై మిగతా నాలుగు భూతాలూ ఆడుతూ ఉంటాయి.
పంచభూతాలు, ప్రాణము, మహాప్రాణం , మనస్సు ,విశ్వ మానసం , ఇవన్నీ ఒకే తత్త్వం తో తయారై ఉన్నాయి.
జీవాత్మ సాధకునిగా మారినప్పుడు ...అప్పుడు మాత్రమే వ్యక్తా అవ్యక్త చైతన్యం గురించి అర్ధం చేసుకోగలదు.
సాధనా సంపత్తి ఉన్నవాడే సాధకుడు. కేవలం ప్రశ్నలు వేసేవాడు సాధకుడు కాడు . పరిప్రశ్న వేయడం జిజ్ఞాసను సూచిస్తుంది. జి జ్ఞాస తీవ్రతరమైనప్పుడు మాత్రమే సత్ - అసత్ విచారణ , విచక్షణ , వివేకం పదునెక్కుతాయి. అహంకారం కరిగించుకుంటూ యజ్ఞ దాన తపస్సులు చేయడం అభ్యాసం చేస్తూ ఉంటే క్రమేణా వివేకం తోకూడిన అహంకారరహితమైన వైరాగ్యం స్థిరపడుతుంది.
ఈ సాధనకు శ్రవణం , మననం అనగా సద్గురు బోధనలు ( ఆత్మతత్వం లో స్థిరమైన వారే సద్గురువులు), సత్ సాంగత్యం , సత్ చింతన అత్యవసరం . శ్రవణ , మననాలతో బుద్ధి సద్బుద్ధి గా మారుతుంది. మనస్సు దోషరహితం అనగా మల విక్షేప ఆవరణలు తగ్గుతాయి. కానీ చిత్తములో పూర్వ సంస్కారాలు , వాటిద్వారా ఉద్భవించే అరిషడ్వార్గాలు పోవాలంటే , నిధి ధ్యాస అవసరం. అనగా నిత్యజీవితాన్ని సాక్షిగా వివేక విచక్షలతో వైరాగ్య భావనతో చూడటం అభ్యసించాలి. అప్పుడు మాత్రమే వ్యక్తా అవ్యక్త చైతన్యం గురించి పూర్తిగా అర్ధం చేసుకోగలడు .
ప్రతి కదలిక చైతన్యం నుండే ఉద్భవిస్తుంది,చైతన్యం వ్యక్తం కాదు,అవ్యక్తం కాదు,రెండింటికి భిన్నమైనది, ప్రతి ఆలోచన ఈ చైతన్యం నుండే ఉద్భవిస్తుందని ఈ ఉపనిషత్ చెప్తుంది
-----------------------
3) కఠోపనిషత్:--
గురువు ఎక్కడపడితే అక్కడ దొరికే వస్తువుకాదు. యమ ధర్మరాజు లాంటి గురువు, శ్రీకృష్ణుడిలాంటి గురువు ఎప్పుడు దొరికారు ?
తన జీవత్వానికి అనగా అహంకారానికి లేదా మమకారానికి ఎదురుదెబ్బ తగిలినప్పుడు
జీవునిలో మహా జిజ్ఞాస మొదలవుతుంది. సాధారణమైన జిజ్ఞాస కేవలం జవాబులు మాత్రమే వెదుకుతుంది . మహా జిజ్ఞాస సద్గురువుని వెదికి పట్టుకొంటుంది.
ఆత్మ తత్వాన్ని దర్శించినవారే నీకు అనుభవాన్ని ప్రసాదించగలరు.
-----------------------
4) ప్రశ్న ఉపనిషత్:--
నామ ,రూప,క్రియలతో నిండిన ఈ సృష్టి స్వచ్ఛమైన పురుషతత్వం నుండి వచ్చింది.గంగా యమునా నదులన్నీ నామరూపాలతో ఉంటాయి.సముద్రంలో కలిసాక నామరూపాలను వదిలేస్తాయి.అలాగే పురుష చైతన్యంతో లీనమయ్యాక ఆ కలయిక ఆత్మగానే,మనకు ఏకంగా సాక్షాత్కరిస్తుంది.
---------------------------
5) ముండకోపనిషత్:--
నీవు చూసే ఈ ప్రపంచం అంతా బ్రహ్మస్వరూపమే,అది పరిపూర్ణంగా నీ చైతన్యమే,ఎక్కడ చూచినా,ఏమి చూచినా,నీకు నువ్వే దర్శనమిస్తుంటావని చెప్తుంది.
-------------------------------
6) మాండూక్య ఉపనిషత్:--
జాగృద్,స్వప్న,సుషుప్తావస్థ అనే 3 అవస్థలు మానవునికి ఉంటాయి,3 అవస్థలు లేవు,అంతా కలిసి తురియావస్థ లొనే ఉందని తెలుస్తుంది, చూసేవాడు,చూడబడేది,ఇలా రెండు లేవు,రెండూ ఒక్కటే అని చెప్తుంది.
---------------------------
7) తైత్తరేయ ఉపనిషత్:--
మనలో ఉన్న పంచకోశాలు,ఒక్కొక్క పొరలాగా,విప్పుకుంటూ పోయి ఆనందమయ కోశం కూడా దాటి చివరికి కోశాలన్నీ నాకు వేరుగా లేవు,అవన్నీ నా స్వరూపాలే అని చెప్తుంది.
-------------------------------
8) ఐతరేయ ఉపనిషత్:--
ఆత్మను అనేకత్వంగా కాక,ఏకత్వం గా చూడటం నేర్చుకోవాలి,దృష్టి ని ఏకత్వం వైపు మళ్లించాలి,జీవ జగత్ రూపమైన సృష్టి అంతా ఒక సంకేతం అని శాస్త్రం వర్ణిస్తుంది,ఇదే శాస్త్ర రహస్యం అంటుంది ఐతరేయం.
----–---------------------
9) చాంధోగ్య ఉపనిషత్:--
అంతా ఏకత్వమే అని గ్రహించాక,నేను అనగా శరీర ఇంద్రియాలకు అతీతంగా ఉన్న చైతన్యం అని,ఏకాత్మ రూపమైన ఆ పరమాత్మే నువ్వేనాని చెప్తుంది,తత్వమసి అని చెప్తుంది చాందోగ్యం.
------------------------
10) బృహదారణ్యక ఉపనిషత్:--
మనం చేయవలసిన సాధన బాహ్యంగా కాదు,సాధన అంతరంలో చేయాలని అహం బ్రహ్మాస్మి అనే సిద్ధాంతం ఈ ఉపనిషత్ చెప్తుంది.