Search This Blog

Friday 4 December 2020

కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లుల్ని రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?*

   * కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లుల్ని రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?*

ప్రభుత్వం ఏమంటుంది ?
  • కొత్త చట్టాలప్రకారం, రాష్ట్ర సహకార మార్కెట్ అనే చిన్న స్థాయి నుండి ప్రపంచం మొత్తం ఒక మహా మండీ గా మారుతుంది.
  • కనీస మద్దతు ధర అనే బిచ్చమ్ పై ఆధారపడకుండా రైతులు సంఘటితమై తమ సరకులను ప్రపంచంలో ఎక్కడికైనా ఎగుమతి చేసుకోవచ్చు.
  • వ్యవసాయరంగం లోకి ప్రవేట్ పెట్టుబళ్ళు ఎక్కువగా వస్తాయి కాబట్టి రైతులకిష్టం ఉంటే ప్రవేట్ పెట్టుబడిదారులతో కౌలు అగ్రిమెంట్ చేసుకొని ఎక్కువ కౌలు పొందే అవకాశం ఉంటుంది.
  • అలాగే వాణిజ్యపరంగా ఏ వంగడానికి ఎక్కువ డిమాండ్ ఉంటే ఆ వంగడాన్ని పండించే అవకాశం ఉంటుంది.
  • విత్తనాలు, భూమిని తయారు చేయడం, ఎరువులు,పురుగుమందులు ,కోత మిషన్లతో మాసూలు తదితర ఖర్చులు కమ్యూనిటీ వ్యవసాయం ద్వారా తగ్గించుకోవచ్చు. రైతులే సంఘాలుగా ఏర్పడి సబ్సిడీలు, సాఫ్ట్ లోన్ లు తీసుకొని గిడ్డంగులు, సోలార్ డ్రయ్యర్ లు ,శీతల స్టోరేజీ లు నిర్మించుకొని డిమాండ్ పెరిగేవరకు సరకును నిల్వ చేసుకోవచ్చు.
  • ఇదే చట్టాన్ని కార్పోరేట్ వాళ్లకు అనుకూలంగా ఉందని కూడా చెప్పవచ్చు. ఒక విషయాన్ని చూసే దృక్పధం ను అనుసరించి మన అవగాహన ఉంటుంది. అలాగైతే ఇప్పటివరకు మన రైతులు కౌలు కిచ్చేది ప్రవేట్ వ్యక్తులకే గదా? ఇప్పుడు ఎక్కువ డబ్బు,మందీ మార్బలం ఉన్న పెద్ద ప్రవేట్ వాళ్లకి కౌలుకిస్తే ఎక్కువ కౌలు గిట్టుబాటవుతుంది గదా?
వ్యవసాయానికి, సరకు మార్కెటింగ్, సరకు నిల్వ కు సంబంధించి,కేంద్రప్రభుత్వం 3 రకాల చట్టాలకు సవరణచేసింది.
వ్యవసాయం లో కూడా ,రక్షణ రంగంలో మాదిరిగానే ప్రయివేట్ శక్తులను అనుమతిస్తే తప్ప వ్యవసాయం లాభసాటిగా మారదు . కానీ నిత్యావసరాల ధరలు అదుపుచేసే సిస్టమ్ ప్రభుత్వం చేతిలో ఉంచుకోకపోతే అమెరికా,యూరప్ దేశాలలో మాదిరిగా ఆహార వస్తువుల ధరలు చాల ఎక్కువగా పేరిగిపోతాయి. అంతేకాదు ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి ఆరోగ్యాన్ని కూడా పాడుచేసే ప్రమాదం ఉంటుంది.
మనదేశం లో చిన్న కమతాల వలన యాంత్రికత పెరగక పోవడం చేత, కూలీలపైనే ఎక్కువగా ఆధారపడటం వలన పంట ఖర్చు బాగా పెరిగిపోతుంది.
కమ్యూనిటీ ఫార్మింగ్ , కార్పొరేట్ ఫార్మింగ్ రావలసిన ఆవశ్యకత ఉంది.

దేశ వ్యవసాయ ఉత్పత్తులలో 30 శాతం వృధాగా పాడవటానికి కారణం కోల్డ్ స్టోరేజీ ,సోలార్ డ్రయర్ లు సరిపడా అందుబాటులో లేకపోవడం.
కానీ,ఎప్పుడైతే కార్పొరేట్ సంస్థలు వ్యవసాయంలోకి ఎంటర్ అవుతాయో అప్పుడు జన్యు మార్పిడి సంకర వంగడాలు ,ఎరువులు,మందుల వినియోగం అదుపుతప్పి భూసారానికి ,దేశవాళీ విత్తన జన్యువులకు ప్రమాదం కలిగే అవకాశం కూడా ఉంటుందని మరచిపోకూడదు.

పాత చట్టాల ప్రకారం , నిత్యావసర సరకులను ఒక పరిమితికి మించి నిల్వ చేయ కూడదు.
కొత్త చట్టాల ప్రకారం ఎన్నైనా నిల్వ చేసుకోవచ్చు.
నల్ల బజార్ లెక్క నిల్వలు చేసేసి మార్కెట్ లో ధరలు పెంచేస్తే ?
ధరలు ఒక పరిమితి దాటి పెరిగినప్పుడు ప్రభుత్వం ఆంక్షలు విదిస్తుంది.
ఇది జరిగే పనేనా? కార్పొరేట్ కంపెనీల చేతిలో ప్రభుత్వాలు కీలుబొమ్మలు గదా?
ఇప్పుడు పంట చేతికి రాగానే ప్రభుత్వం సూచించిన మద్దతు ధరకు సరుకు ను అమ్మకొంటున్నారు.
కొత్త చట్టాల ప్రకారం , ప్రభుత్వ కనీస మద్దతు ధర అనేది లేకపోవడం వలన , తమ సరకును దాచుకొనే సాంకేతికత, ప్రాసెస్ చేసుకొనే వెసులుబాటు లేకపోవడం వలన బక్క రైతులు ఏదో ఒక ధరకు తెగ నమ్ము కోవలసి వస్తుంది. మీకు తెలుసుగా మనదేశం లో 86 శాతం బక్క రైతులే!

86% చిన్న సన్నకారు రైతులున్న దేశంలో రైతులు తమ పొలంలో పండిన వాటిని సొంతంగా స్టోర్ చేసుకోలేరు. ఎందుకంటే రైతులకు AC గోడౌన్లు లేవు. కాబట్టి ఎలాగైనా దళారీలకో, కంపెనీలకో ఉత్పత్తి అయిన పంట పాడు అవకుండా తొందరగా అమ్మేస్తారు. ఇక్కడ లాభం పొందేది దళారీలు, కార్పొరేట్ కంపెనీలు మాత్రమే. ఎప్పటిలానే రైతు మోసపోతాడు.*
కాబట్టి ఇక్కడ రెండు పరిష్కారాలు . గిడ్డంగులు,ప్రాసెస్ ప్లాంట్ లు రైతు సంఘాలు నిర్మించుకొనేటట్లు ప్రభుత్వాలు గ్రాంట్ ,సబ్సిడీ లివ్వాలి. అలాగే ప్రయివేట్ కంపెనీలు కూడా వీటిని నిర్మించడానికి సబ్సిడీ రుణాలివ్వాలి.


అదేమిటి సార్! కొత్త చట్టాల ప్రకారం రైతులు భారతదేశంలో ఎక్కడైనా సరే తమ పంట ఉత్పత్తులు అమ్ముకో వచ్చు గదా?
బక్క రైతులు అందరూ కలిసి ఒక సంఘం లా ఏర్పడి తమ సరకును బయట ప్రపంచం లో గిరాకీ బాగా ఉన్న చోట అమ్ముకొని లాభాలు గడించ వచ్చు గదా?
*ఒక చిన్న, సన్నకారు రైతు నిజంగా తన పంటను వేరే రాష్ట్రానికి వెళ్లి అమ్ముకుంటాడా? పక్క జిల్లాలోని మార్కెట్ యార్డులోనే అమ్ముకోవడానికి ట్రాక్టర్లు, లారీలకు బాడుగలు ఇచ్చుకోలేక నలిగిపోతున్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక సరైన ధర లేక కొన్నిసార్లు అక్కడే పడేసి వస్తున్నాడు. కాబట్టి ఇది రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి చేసిన చట్టం కాదు.*
మధ్య దళారీలు, కార్పొరేట్ కంపెనీలు దేశంలో & ప్రపంచంలో ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ అమ్ముకోవడానికి వీలు కల్పించే చట్టం ఇది.
పరిష్కారం . రైతులు సంఘాలుగా ఏర్పడటం కనీస బాధ్యత. కనీస మద్దతు ధరను ప్రకటించడం ప్రభుత్వాల కనీస బాధ్యత.
కాంట్రాక్ట్ ఫార్మింగ్...చట్టం తెచ్చారు. అదేమీ నిర్బంధమేమీ కాదు. రైతుకి ఇష్టం ఉంటే నే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతాడు.
కాంట్రాక్ట్ ఫార్మింగ్... వలన కలిగే నష్టాలు రైతులకు తెలుసు గదా? ఇందులో మభ్యపెట్టేదేమీ ఉండదు.

కాంట్రాక్ట్ ఫార్మింగ్..గురించి నెగిటివ్ దృక్పధం తో వెలిబుచ్చిన అభిప్రాయాలను చూడండి ---
రైతు ముందుగానే ఏ పంట వేయాలో, ఏ ఎరువును వాడాలో అని నిర్దేశించి ఈ కార్పొరేట్ కంపెనీలు రైతులతో 5 సంవత్సరాల వరకూ అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఈ అగ్రిమెంట్ లో ఎంత ధర ఉంటే అంతే రైతు తీసుకోవాలి. రాబోయే 5 ఏళ్ల కాలంలో ధరలు పెరిగినా రైతు మాత్రం అగ్రిమెంట్ ప్రకారమే డబ్బు పొందుతాడు కానీ మార్కెట్ రేటు ప్రకారం కాదు. ఈ కార్పొరేట్ కంపెనీలతో కాంట్రాక్ట్ వ్యవసాయం చేసిన 5 సంవత్సరాల తర్వాత భూమిని చూస్తే పనికిరాని విధంగా రసాయనాలతో నిండిపోయి సారం కోల్పోతుంది. గ్రౌండ్ వాటర్ మొత్తం అయిపోగొట్టేస్తారు. భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల దాకా వ్యవసాయానికి పనికిరాకుండా తయారు అయిపోతుది భూమి. *అలాంటి భూమి ని ఏమీ చేసుకోలేక చివరకు ఆ దళారీలకో, కంపెనీలకో భూముల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది.*
ఇవన్నీ పూర్తిగా నెగిటివ్ దృక్పధం తో వెలిబుచ్చిన అభిప్రాయాలు. కాంట్రాక్ట్ లో షరతులు ఇష్టం లేకపోతె ఆ రైతు కాంట్రాక్ట్ లోకీ ఎంటర్ అవ్వడు .

కొన్ని పరిష్కారాలు .
1. కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసే కంపెనీ, MS స్వామినాథన్ చెప్పినట్టు, రైతు పెట్టుబడికి 50% అదనంగా సొమ్మును కలిపి మద్దతు ధరగా చెల్లించాలి.
2. రైతు ఉత్పత్తులు కొన్న కంపెనీ ఫారిన్ కి ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు కల్పించకూడదు. లేదా భారతదేశంలో ఖచ్చితంగా 70% సేల్ చేయాలి అని నిబంధన తేవాలి.
3. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కేవలం సేంద్రీయ ఎరువులు లేదా జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ ద్వారానే చేయాలి. రసాయనాలు వాడడం బ్యాన్ చేయాలి. లేదంటే కార్పొరేట్లు పిప్పి పీల్చేసిన భూమి రైతులకు దేనికీ పనికిరాదు.
5. ప్రతి గ్రామంలో శీతల గిడ్డంగులు, గోదాముల కట్టించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెంచాలి.
6. రైతు ఉత్పత్తి సంఘాలను బలోపేతం చేసే వ్యవస్థను ఏర్పాటుచేయాలి.
*ఇవన్నీ ఏమీ చేయకుండా కార్పొరేట్లకు లాభం చేకూర్చే బిల్లులు పాస్ చేయడం వల్ల రైతులు ఎంతో నష్టపోతారు. రైతు నష్టపోతే సామాన్యుడికి తిండి కూడా దొరకని పరిస్థితి వస్తుంది.*