తోడుని ఇచ్చేది పెళ్ళి. నీడను ఇచ్చేది ఇల్లు . అందుకే, ఇల్లు - ఇల్లాలు " అనేవి మానవ సమూహాల కేకాదు పశు పక్ష్యాదులకు కూడా కనీస అవసరం . పెళ్లి అవసరాన్ని మాత్రమే వివరిస్తాను. అర్ధాన్ని, పరమార్ధాన్ని ఇక్కడ చెప్పబోవడం లేదు.
మనకు రోజూ ఆనందం, దుఃఖం, ఈర్ష్య, కోపం వంటి రకరకాల భావోద్వేగాలకు గురవుతాము. మనిషిగా వాటిని పంచుకోవడానికి మనకొక ఆలంబన, భవిష్యత్తుకు భద్రత అవసరం. అల్లారు ముద్దుగా పెంచిన అమ్మనాన్నలు మనకన్నా ముందే మనని వీడి వెళ్ళిపోతారు. తోబుట్టువులు వారి జీవితాన్ని వెతుక్కుని వాళ్ల సంసార జంజాటాలలో ఈత కొడుతూ అందుబాటులో ఉండకపోవచ్చు. కనక మనతో పాటు సదా నడిచే ఒక తోడు మనకు అవసరం. మనం కన్నబిడ్డలు కూడా రెక్కలు రాగానే విద్యావృత్తుల వెతుకులాటలో దూరతీరాలకు ఎగిరిపోతారు. వయస్సులో ఉన్నప్పుడు ఎవ్వరి అవసరం లేదనుకున్నా, వయస్సు మీరాకా, మన పక్కన, మన కోసం నేల మీద పట్టు కోసం ప్రయత్నిస్తూ ఊతకర్ర పట్టుకుని నిలబడి ఉండే ఒక మనిషిని చూస్తే పుట్టే కొండంత ధైర్యాన్ని పెళ్ళి అనే వ్యవస్థ సాధ్యపరుస్తుంది.
మా అమ్మ నాకొక కథ చెప్పేది. తన చుట్టూ ఉన్న మనుషుల జీవితాల్లో ఈతిబాధలను చూసి విరక్తి చెందిన ఒక వ్యక్తి, మనశ్శాంతికి కేవలం భగవద్ధ్యానమే మార్గమని ఎంచి, ధ్యానం చేయడం మొదలుపెట్టి సాధువుగా మారాడు. భవబంధాలు అన్నింటిని వదిలి తనకంటూ కేవలం రెండు గోచీలు మాత్రమే (అవి కూడా ఒకటి ఒంటిపై, ఒకటి దండెంపై ఉతికి ఆరేసినది) ఉంచుకున్నాడు.
కొన్నాళ్ళకు ధ్యానంలో ఉన్న సాధువును ఒంటి మీది గోచీ కొరుకుతూ ఒక ఎలుక ఇబ్బంది పెట్టడం మొదలెట్టింది. సాధువు ఎలుక బాధ భరించలేక పిల్లిని పెంచడంతో మొదలుపెట్టి, పిల్లి ఆకలి తీర్చే పాలు కొరకు ఆవుని, ఆవును మేపడానికి ఆలిని, ఆలిని బాధ పెట్టకూడదని ఆమెకు ఒక బిడ్డని తన జీవితంలోకి రానిచ్చి తిరిగి సంసార మోహమాయకు బంధీ అయ్యాడు. తను జీవనం సాగాలంటే కాషాయం కట్టిన సాధువుకు కూడా ఒక తోడు కావలసి వచ్చింది. ఆ తోడుని ఇచ్చేది పెళ్ళి !
దీనినే ‘కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపః’ అని చెప్తారు
No comments:
Post a Comment