Search This Blog

Sunday, 21 August 2022

శ్రీ కృష్ణ తత్త్వం

 

శ్రీ కృష్ణ తత్త్వం 


వేలాది రాజుల సమక్షంలో తనను అగ్రపీఠంమీద కూర్చోబెట్టినా తన కళ్లముందే ద్వారకాపట్టణం సముద్రంలో కుంగిపోతున్నా రెండూ కర్మననుసరించి వచ్చిన ఫలితాలే అంటాడు. రెంటినీ అంతే ఆనందంగా స్వీకరిస్తాడు. సమస్య తలెత్తినప్పుడూ అదే నవ్వూ... గెలిచిన తర్వాతా అదే చిరునవ్వూ. ఆ నవ్వే కృష్ణతత్వం.
సంసారాన్ని వీడడు... ఏదీ త్యాగంచేయడు... కష్టాలు ఎదురైనప్పుడు కూడా సంతోష సాగరంలో ఎలా మునకలువేయాలో సులువుగా చేసిచూపడమే మానసచోరుడి లీలావినోదం.

జీవితం అంటే ఏమిటీ... అని ప్రశ్నించుకునే మనుషులకు పరిపూర్ణం నుంచి ఉద్భవించిన మానవ జన్మ తిరిగి పరిపూర్ణంలోనే కలిసిపోయే నిర్దిష్టమైన గమనమన్నాడు గీతాచార్యుడు. ఈ ప్రయాణం అంత సులువైంది కాదన్నాడు. అది బంధాలతో అల్లుకుంటుందనీ బాధ్యతలతో నిండి ఉంటుందనీ, శిఖరాలను చూపిస్తుందనీ, లోతుల్లోకి తోసేస్తుందనీ తెలిపాడు. ఎలా జీవించాలో జీవితాన్ని ఎలా అందిపుచ్చుకోవాలో ఆచరించి చూపాడు. అందుకే కృష్ణుడి జీవితం మానవాళికి ఓ విలువైన సందేశం. నందనందనుడు నమ్మి చేరిన వారిని కాదన్న సందర్భమే లేదు. ఒకవైపు ప్రేమను పంచుతూనే మరోవైపు ధర్మాన్ని నిలబెట్టాడు. మనిషిగా పరిపూర్ణత్వాన్ని ఎలా సాధించాలో మొత్తం మానవజాతికి చెప్పకనే చెప్పాడు. కృష్ణుడు 

కన్నయ్యకు బంధాలంటే అమితమైన తీపి. అందుకే ఆయన అందరికీ బంధువే. ప్రతి బంధాన్నీ వెన్నముద్దల్లా అపురూపంగా ఒడిసిపట్టాడు. బంధుత్వాలను ఎలా కొనసాగించాలో చెప్పకనే చెప్పాడు. బంధాలు మనకి బంధనాలు కావనీ ఆయా రూపాల్లో భగవంతుడేననీ గ్రహించమంటూ భాగవత సూత్రాన్ని అలవోకగా వివరించాడు.

దుష్టులను శిక్షించడానికీ ధర్మం పక్షాన నిలబడటానికీ మాధవుడు వేయని ఎత్తుగడ లేదు, చేయని రాజకీయం లేదు. కాళీయ మర్దనం నుంచీ కురుక్షేత్ర సంగ్రామం వరకూ ప్రతిదీ కన్నయ్య ప్రణాళికే. అంతటి రాజనీతిజ్ఞుడు మరొకడుండడు. మహాభారతాన్ని రాజకీయకోణంలో చూస్తే కృష్ణుడిదే కీలక పాత్ర.

నాయకుడు అన్నవాడు ఎలా ఉండాలో కృష్ణయ్య యుగాలనాడే చూపించాడు. ముందుండి నడిపేవాడు సమస్యలకూ, సవాళ్లకూ భయపడిపారిపోకూడదు. చివరివరకూ విజయం మనదేనన్న భావంతో పోరాడాలి. తన బృందంలోనూ అదే స్ఫూర్తిని నింపాలి. గోకులంలో

 కష్టాలూ, సవాళ్లూ ఎదురైనప్పుడు.. ధైర్యంగా అడుగు ముందుకు వేయమంటాడు. లక్ష్యాన్ని నిర్దేశించుకోమంటాడు. మానసిక ధైర్యాన్ని అలవర్చుకోమంటాడు. అందుకే కృష్ణతత్వం...సమస్యల సుడిగుండంలో కూరుకుపోయినవారికి నిచ్చెనలు మాత్రమే ఉండే పరమపదసోపానం, గమ్యమేంటో తెలియక పరుగులు తీసేవారికి దారిచూపే వెలుగురేఖ, ఒత్తిడితో సతమతమయ్యే వారికి తిరుగులేని ఔషధం శ్రీకృష్ణుడు. 

 

No comments:

Post a Comment